ప్రేమ వివాహం.. ఆ తర్వాత వివాహేతర సంబంధం
ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసులో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రామ్‌నగర్‌కు చెందిన సంజీవ్ కుమార్ (24) టెంట్ హౌస్ వ్యాపారం నిర్వహించేవాడు. ఐదేళ్ల క్రితం నిషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అంగీకరించకపోయినా వారిని ఎదిరించి నిషాను వివాహం చేసుకున్నాడు.
కొంతకాలం తర్వాత సంజీవ్ కుమార్ టెంట్ హౌస్‌లో పనిచేసే 17 ఏళ్ల బాలుడితో నిషాకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.
భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన నిషా.. సంజీవ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పుట్టినరోజు పార్టీ పేరుతో పిలిచి..
సంజీవ్‌ను హత్య చేయాలని నిషా తనతో సంబంధం కొనసాగిస్తున్న 17 ఏళ్ల బాలుడికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో ఆ బాలుడు మరో మైనర్ బాలుడితో కలిసి ప్లాన్ చేశాడు.
ఆగస్టు 16న తమలో ఒకరి పుట్టినరోజు వేడుకలకు రావాలని చెప్పి సంజీవ్‌ను పార్టీకి తీసుకెళ్లేందుకు ఇద్దరు మైనర్లు ఒప్పించారు.
కారులో సంజీవ్ డ్రైవింగ్ చేస్తుండగా.. వెనుక సీట్లో ఉన్న మైనర్ బాలుడు తుపాకీతో అతని మెడపై కాల్పులు జరిపాడు.
కారు ప్రమాదంగా చిత్రీకరణ
తుపాకీ కాల్పులతో సంజీవ్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. కారు రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురైంది.
అనంతరం ఇద్దరు మైనర్ బాలురు అక్కడి నుంచి పారిపోయారు.
సంజీవ్ కారు ప్రమాదంలోనే చనిపోయినట్లు నిషా అందరినీ నమ్మించినట్లు పోలీసులు తెలిపారు.
పోస్టుమార్టంలో బయటపడిన అసలు విషయం
పోలీసు కేసు కావడంతో నిబంధనల ప్రకారం సంజీవ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ సమయంలో అతని మెడలో తుపాకీ తూటా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
వెంటనే నిషాను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఇద్దరు మైనర్ బాలురతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
లోతుగా విచారణ చేయగా.. 17 ఏళ్ల బాలుడితో నిషాకు ఉన్న వివాహేతర సంబంధమే భర్త హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో నిషాతో పాటు ఇద్దరు మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



