యూపీలో మూడు రంజీ జట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్
లక్నో: మైదానంలో మ్యాచ్‌లు ఆడాల్సిన యువ క్రికెటర్లు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఏకానా స్టేడియం వద్ద 250 మందికి పైగా యువ క్రికెటర్లు, వారి తల్లిదండ్రులు నిరసన చేపట్టారు.
ఉత్తరప్రదేశ్‌కు మూడు రంజీ జట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
25 కోట్ల జనాభాకు ఒక్క జట్టేనా?
దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. సుమారు 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో వేలాది మంది యువకులు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు.
అయితే రాష్ట్రానికి ఒక్క రంజీ జట్టు మాత్రమే ఉండటంతో ప్రతిభ ఉన్న చాలా మంది ఆటగాళ్లకు తగిన అవకాశాలు దక్కడం లేదని క్రికెటర్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ పూర్వాంచల్ ఆధ్వర్యంలో ఏకానా స్టేడియం వద్ద భారీ నిరసన చేపట్టారు. పూర్వాంచల్, సెంట్రల్ యూపీ ప్రాంతాలకు చెందిన జెన్-జీ క్రికెటర్లు తమకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు క్రికెట్ అసోసియేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అరవింద్ సింగ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద రాష్ట్రంలో ప్రతిభకు కొదవ లేదన్నారు.
ఒక్క రంజీ జట్టు ఉండటం వల్ల వందలాది మంది ప్రతిభావంతులైన ఆటగాళ్ల భవిష్యత్తు దెబ్బతింటోందని చెప్పారు.
అందుకే యూపీని మూడు క్రికెట్ మండలాలుగా విభజించి, మూడు వేర్వేరు అసోసియేషన్ల ద్వారా ప్రతి ఏడాది మూడు రంజీ జట్లను బరిలోకి దించాలని ప్రతిపాదించారు.
దీనివల్ల ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు డొమెస్టిక్ క్రికెట్‌లో అవకాశం లభిస్తుందని తెలిపారు.
యూపీ టీ20 లీగ్ సెలక్షన్‌పైనా ఆరోపణలు
రంజీ ట్రోఫీతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ సెలక్షన్‌పైనా క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
లీగ్‌లో ఎంపికైన దాదాపు 150 మంది ప్లేయర్లలో పూర్వాంచల్, మధ్య యూపీ ప్రాంతాల నుంచి కేవలం 16 మందికే అవకాశం దక్కిందని ఆరోపించారు.
అదే సమయంలో పశ్చిమ యూపీలోని తొమ్మిది జిల్లాల నుంచి 89 మందిని ఎంపిక చేశారని గణాంకాలతో వివరించారు.
ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ప్లేయర్లను కూడా లీగ్‌లోకి తీసుకోవడంపై ప్రాంతీయ ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్త ఆందోళన
లక్నోలో జరిగిన ధర్నా కేవలం ఆరంభం మాత్రమేనని అసోసియేషన్ హెచ్చరించింది.
తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని తెలిపింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువ క్రికెటర్లను ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది.
భారత జాతీయ జట్టులోకి ఎదగడానికి డొమెస్టిక్ క్రికెట్ తొలి మెట్టు అని, తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని క్రికెటర్లు స్పష్టం చేశారు.



