ఆగ్రా రైల్వే స్టేషన్లో బయటపడిన హత్య మిస్టరీ
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఆగ్రా రైల్వే స్టేషన్ ట్రాలీ బ్యాగ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చెన్నై సమీపంలో ఓ మహిళను దారుణంగా హత్య చేసి, శరీర భాగాలను వేర్వేరు చోట్ల దాచిన ఘటన బయటపడింది.
ఆగ్రా రైల్వే స్టేషన్లో ట్రాలీ బ్యాగ్
ఆగస్టు 5న ఆగ్రా రైల్వే స్టేషన్లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్ కనిపించింది.
దాన్ని పరిశీలించిన పోలీసులకు తల లేని, కుళ్లిపోయిన మహిళ మొండెం కనిపించింది.
దీంతో ఆగ్రా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో మృతురాలు ఒడిశాకు చెందిన హయాతున్ నిషా అని గుర్తించారు. ఆమె చెన్నైలోని గూడువాంచేరి ప్రాంతంలో నివసిస్తూ పని చేసేది.
సీసీటీవీ, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు
కేసు దర్యాప్తులో చెన్నై సెంట్రల్ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ కూడా రంగంలోకి దిగాయి.
ఆగస్టు 3 రాత్రి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని 4వ ప్లాట్‌ఫామ్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
అందులో ఓ మహిళ, ఓ పురుషుడు అనుమానాస్పదంగా ట్రాలీ బ్యాగ్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
మరోవైపు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిందితుల ఆచూకీని చెంగల్పట్టు జిల్లా గూడువాంచేరి మసీదు వీధిలోని ఓ అద్దె ఇంటి వద్ద గుర్తించారు.
బిర్యానీ పాత్రలో శరీర భాగాలు
పోలీసులు ఆ ఇంట్లో సోదాలు నిర్వహించగా భయానక దృశ్యాలు కనిపించాయి.
వంటింట్లో ఉన్న పెద్ద బిర్యానీ పాత్రలో ముక్కలుగా నరికిన మహిళ శరీర భాగాలు లభించాయి.
దుర్వాసన బయటకు రాకుండా ఉండేందుకే వాటిని పాత్రలో దాచినట్లు పోలీసులు గుర్తించారు.
హయాతున్ నిషా, అసోంకు చెందిన మణిక్ ఉదిన్ లస్కర్, ఒడిశాకు చెందిన భగవతి మాజీతో కలిసి ఆ ఇంట్లో నివసించేది.
వారి మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
హత్య తర్వాత హయాతున్ నిషా మొండేన్ని ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి రైలులో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు.
మిగిలిన శరీర భాగాలను మాత్రం అద్దె ఇంట్లోనే వదిలి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
నిందితుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు
సంఘటనా స్థలాన్ని ఉన్నతాధికారులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ పరిశీలించాయి.
అక్కడి నుంచి వేలిముద్రలు, రక్తపు నమూనాలను సేకరించారు.
ప్రస్తుతం మణిక్ ఉదిన్ లస్కర్, భగవతి మాజీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
వారి కోసం బృందాలు అసోం, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లాయి.
ఈ హత్యకు వివాహేతర సంబంధం కారణమా? లేక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదమా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులు పట్టుబడితే హత్యకు అసలు కారణం మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.



