రాష్ట్రంలోని పేద ఎస్సీ విద్యార్థులు దేశంలోని అత్యున్నత సివిల్ సర్వీసెస్ (IAS, IPS) పరీక్షల్లో రాణించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉచిత ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విద్యార్థులకు ట్యాబ్‌లు, మెటీరియల్‌ను పంపిణీ చేశారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రముఖ శిక్షణా సంస్థ ‘ఫిజిక్స్ వాలా’తో కలిసి ఈ ఉచిత ఆన్లైన్ కోచింగ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా ఇప్పటికే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తున్నామని, అక్కడ సీటు సాధించలేకపోయిన వారికి ఆన్లైన్ శిక్షణ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ను నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం మళ్లీ వీటికి పూర్వవైభవం తెచ్చిందని ఆయన మండిపడ్డారు. పేద పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని, పీ4 (Public-Private-People-Partnership for Povertly Alleviation) ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.అంబేద్కర్ స్ఫూర్తితో పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు.
