అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతలకు అడ్డంకులు
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిపక్ష నేత పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
సభ ప్రారంభమైన సమయంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.
నల్ల టీషర్టులపై స్లోగన్లు కూడా ఉన్నాయి. వాటితోనే వారు అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే భద్రతా కారణాలను చూపిస్తూ పోలీసులు వారిని గేటు వద్ద అడ్డుకున్నారు.
నల్ల టీషర్టులపై పోలీసుల అభ్యంతరం
అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు బీఆర్ఎస్ నేతలను ఆపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీషర్టుల విషయంలో స్పీకర్ ఆదేశాలను పోలీసులు ప్రస్తావించినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
తమను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు.
ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ గేటు వద్దే నిరసనకు దిగారు.
బనియన్లతో హరీశ్‌రావు నిరసన
ఈ పరిణామాల మధ్య మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు వినూత్నంగా నిరసన తెలిపారు. నల్ల టీషర్టును విప్పేసి బనియన్‌తోనే గేటు వద్ద కూర్చున్నారు.
ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా టీషర్టులను విప్పేశారు. బనియన్లతోనే అక్కడ కూర్చొని నిరసన తెలిపారు.
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. తమను సభలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ గేటు వద్ద తోపులాట
బీఆర్ఎస్ నేతలు రోడ్డుపైనే భైఠాయించడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
పరిస్థితి కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు
అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాలను బీఆర్ఎస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వెంటనే నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని అగ్రనాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అసెంబ్లీలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. దీనిపై ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది.
గులాబీ శ్రేణులు రోడ్డెక్కనున్నాయా?
బీఆర్ఎస్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను నిరసిస్తూ నియోజకవర్గాల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రభుత్వ హామీల అమలు అంశాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీలో తమ గొంతు వినిపించకుండా అడ్డుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు.
మొత్తంగా అసెంబ్లీ గేటు వద్ద ప్రారంభమైన నిరసన రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దారితీసింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.



