హైదరాబాద్‌లో విషాదం.. రెండేళ్ల కుమార్తెను చంపి దంపతుల ఆత్మహత్య

October 28, 2026 11:10 AM

ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు

పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లా రాధామోహన్‌పూర్‌కు చెందిన గోపీనాథ్ బుయిన్ (30), సమత (26) 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

కొంతకాలం క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌లో నివాసం ఉంటున్నారు.

ఈ దంపతులకు ఏడాది 11 నెలల వయసున్న స్నిగ్ధ అనే కుమార్తె ఉంది. గోపీనాథ్ గచ్చిబౌలిలోని ఓ ప్రాంతంలో చెఫ్‌గా పనిచేస్తున్నాడు.

ఆయన సోదరులు కూడా ఎల్‌బీనగర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు.

రోజూ చిన్నారితో ఆడుకునే వృద్ధుడు

ఆ కుటుంబానికి ఎదురుగా నివసించే ఓ వృద్ధుడు రోజూ చిన్నారి స్నిగ్ధతో ఆడుకునేవాడు.

అయితే మంగళవారం ఆ ఇంట్లో ఎలాంటి కదలికలు కనిపించలేదు. ఇంటి తలుపులు కూడా తెరవలేదు.

దీంతో వృద్ధుడికి అనుమానం వచ్చింది.

వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు.

ఇంట్లో విగతజీవులుగా దంపతులు

ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు దారుణమైన దృశ్యం కనిపించింది. గోపీనాథ్, సమత డైనింగ్ హాల్‌లో సీలింగ్‌కు ఉరివేసుకుని మృతి చెంది ఉన్నారు. పడక గదిలో చిన్నారి స్నిగ్ధ ప్రాణాలు కోల్పోయి కనిపించింది.

ఈ ఘటనతో పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చిన్నారి ఎలా మృతి చెందిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

గొంతు నులిమి చంపారా? లేక విషం ఇచ్చారా? అనే అంశాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతాయని పోలీసులు భావిస్తున్నారు.

గోడపై సూసైడ్ నోట్.. ఏం రాశారంటే?

ఆత్మహత్యకు ముందు దంపతులు ఇంటి గోడపై ఓ సూసైడ్ నోట్ రాశారు. అందులో తమ నిర్ణయం గురించి ప్రస్తావించారు.

“చాలా కాలం క్రితమే ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము చేస్తున్నది తప్పు అని మాకు తెలుసు. కానీ మాకు మరో దారి కనిపించలేదు. మమ్మల్ని క్షమించండి. మా మరణానికి ఏ మూడో వ్యక్తితోనూ సంబంధం లేదు. దయచేసి మా బంధుమిత్రులను ఎవరినీ విచారించొద్దని మనవి” అని రాసి ఉంది.

దీంతో పాటు బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో రాసిన సూసైడ్ నోట్లను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఆ నోట్లలోని వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

చివరిసారిగా సోమవారం మాట్లాడిన తమ్ముడు

గోపీనాథ్ ఆదివారం విధులకు వెళ్లాడు. సోమవారం సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. గోపీనాథ్ తమ్ముడు రఘునాథ్ సోమవారం చివరిసారిగా తన అన్నతో మాట్లాడినట్లు తెలిపాడు.

దంపతులు, చిన్నారి మరణించి సుమారు 10 గంటలకు పైగా అయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే మరణ సమయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఆర్థిక ఇబ్బందులే కారణమా?

ఈ ఘటనకు ఆర్థిక ఇబ్బందులు ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే దంపతులు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణాలేమిటనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.

సూసైడ్ నోట్లలోని వివరాలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చిన్నారి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media