దర్శక దిగ్గజం, నటుడు, నిర్మాత భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. గతేడాది మార్చి 2025లో భారతీరాజా కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా (48) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. పుత్రశోకం ఆయన్ను తీవ్రంగా కుంగదీసింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడి, శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆసుపత్రిలో చేరినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.
1941 జూలై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి. 1977లో వచ్చిన ’16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఐదు దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్‌లో భారతీరాజా దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తన చిత్రాలతో కుల వ్యవస్థ, గ్రామీణ సమస్యలు, మానవ సంబంధాలను తెరకెక్కించారు. తెలుగులో ఆయన తీసిన ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’ వంటి చిత్రాలు క్లాసిక్‌లు. ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకొకచిలుక’ చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది. 1981లో ఈ చిత్రానికి గాను భారతీరాజాను ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం వరించింది. ఆయనకు ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పద్మ పురస్కారం వరించాయి. 2004లో కేంద్రం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. భారతీరాజా మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

