పెన్షన్ ఖాతాదారులకు బీమా, బ్యాంకింగ్ సేవల్లో అదనపు ప్రయోజనాలు
నమోదు లేకపోతే వెంటనే దరఖాస్తు చేయాలని సూచన
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పెన్షనర్ల కోసం ప్రత్యేక సదుపాయాలతో కూడిన కాంప్రెహెన్సివ్ పెన్షన్ ప్యాకేజీ (CPP) అందిస్తోంది. అయితే చాలా మంది పెన్షనర్ల ఖాతాలు ఇప్పటికీ సాధారణ సేవింగ్స్ ఖాతాలుగానే కొనసాగుతున్నట్లు బ్యాంకు గుర్తించింది. దీంతో వారు ఈ ప్రత్యేక ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.
పెన్షన్ ప్రతి నెలా ఎస్‌బీఐ ఖాతాలో జమ అవుతున్న వారంతా తమ ఖాతా సీపీపీ కింద నమోదు అయి ఉందో లేదో ఒకసారి బ్రాంచ్‌లో నిర్ధారించుకోవాలని బ్యాంకు సూచించింది.
నమోదు కాలేదని తేలితే వెంటనే దరఖాస్తు సమర్పించాలని తెలిపింది.
కనీస నిల్వ అవసరం లేదు
సీపీపీ కింద నమోదైన పెన్షన్ ఖాతాలకు కనీస నిల్వ నిబంధన ఉండదు. ఖాతాలో నిర్దిష్ట మొత్తం లేకపోయినా ఎలాంటి జరిమానాలు ఉండవు. సాధారణ సేవింగ్స్ ఖాతాల్లో ఉండే కొన్ని ఛార్జీల నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది.
పెన్షనర్లకు ఎస్‌ఎంఎస్ అలర్ట్ సేవలు ఉచితంగా అందిస్తారు. అదనంగా RuPay Platinum లేదా Gold ATM-డెబిట్ కార్డును ఎలాంటి జారీ ఛార్జీలు లేకుండా అందిస్తారు. కార్డు నిర్వహణలో కూడా ప్రత్యేక రాయితీలు ఉంటాయి.
రూ.30 లక్షల వరకు ప్రమాద బీమా
ఈ ప్యాకేజీలో ప్రధాన ఆకర్షణ వ్యక్తిగత ప్రమాద బీమా. అర్హత ఉన్న పెన్షనర్లకు రూ.30 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుంది. అంతేకాదు మరికొన్ని ప్రత్యేక బీమా ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఎయిర్ అంబులెన్స్ సేవల కోసం రూ.10 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. ప్రమాదాల్లో కాలిన గాయాలకు అవసరమైన ప్లాస్టిక్ సర్జరీ ఖర్చులకు కూడా రూ.10 లక్షల వరకు సహాయం అందుతుంది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన మందుల రవాణా ఖర్చులకు రూ.5 లక్షల వరకు సాయం ఉంటుంది. కోమా స్థితికి దారితీసే ప్రమాదాల్లో మరణం సంభవిస్తే రూ.5 లక్షల వరకు ప్రత్యేక బెనిఫిట్ అందించే అవకాశం ఉంది.
పిల్లల చదువులకు ఆర్థిక సాయం
పెన్షనర్ల కుటుంబాలకు కూడా ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుంది. పిల్లల ఉన్నత విద్య కోసం రూ.8 లక్షల వరకు సహాయం లభిస్తుంది.
డపిల్లల విషయంలో ఈ పరిమితి రూ.10 లక్షల వరకు ఉంటుంది.
కుటుంబ సభ్యుల ప్రయాణ అవసరాల కోసం రూ.50 వేల వరకు సహాయం అందుతుంది. అత్యవసర అంబులెన్స్ సేవలకు కూడా రూ.50 వేల వరకు కవరేజ్ ఉంటుంది.
మరణానంతరం పార్థివ దేహాన్ని తరలించే ఖర్చులకు కూడా రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.
డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం
సీపీపీ కింద నమోదైన పెన్షనర్లు పలు డిజిటల్ సేవలను సులభంగా వినియోగించుకోవచ్చు.
పెన్షన్ స్లిప్‌ను ఎస్‌ఎంఎస్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా పొందే అవకాశం ఉంది.
అర్హత ఉన్న వారికి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. జీవన్ ప్రమాణ్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సౌకర్యం కల్పించారు.
భార్య లేదా భర్తతో కలిసి జాయింట్ పెన్షన్ ఖాతా నిర్వహించే అవకాశం కూడా ఉంది.
పెన్షనర్లు ఏమి చేయాలి?
మీ పెన్షన్ ఎస్‌బీఐ ఖాతాలో జమ అవుతుంటే సమీప బ్రాంచ్‌ను సంప్రదించండి.
మీ ఖాతా Comprehensive Pension Package (CPP) కింద నమోదు అయి ఉందో లేదో తెలుసుకోండి.
నమోదు లేకపోతే అవసరమైన దరఖాస్తు సమర్పించి ఈ ప్రత్యేక సదుపాయాలను పొందండి.
చిన్న ప్రక్రియ పూర్తి చేస్తే లక్షల రూపాయల విలువైన బీమా రక్షణతో పాటు పలు బ్యాంకింగ్ ప్రయోజనాలు మీకు అందుబాటులోకి వస్తాయి.

