హైదరాబాద్: తెలంగాణలో ఇకపై ట్రాఫిక్ చలాన్లు వాట్సాప్, ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా పంపినా అధికారికంగా అందినట్టే పరిగణిస్తారు. ఇందుకోసం వాహన యజమానులు 30 రోజుల్లోగా వాహన్ పోర్టల్‌లో తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు నవీకరించాలి.
గడువు ముగిసిన తర్వాత వాహన్ డేటాబేస్‌లో నమోదైన నంబర్ లేదా ఈమెయిల్‌కు పంపిన చలాన్ అందినట్టే భావిస్తారు. “మెసేజ్ రాలేదు”, “చలాన్ గురించి తెలియదు” అనే కారణాలను ఇక చూపలేరు
పెండింగ్ చలాన్ల వసూళ్లు పెంచడం, నోటీసులు నేరుగా వాహన యజమానులకు చేరేలా చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని అధికారులు తెలిపారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనల కింద ప్రభుత్వం ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈమెయిల్‌ను చలాన్ల పంపిణీకి చెల్లుబాటు అయ్యే ఎలక్ట్రానిక్ మార్గాలుగా గుర్తించింది.
ALSO READ
నెల రోజుల్లో వివరాల నమోదు
నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి ఒక నెలలోపు వాహన యజమానులు వాహన్ డేటాబేస్‌లో నమోదైన మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను పరిశీలించి అవసరమైతే సరిచేయాలి. గడువు ముగిసిన తర్వాత పాత వివరాలు కొనసాగినా బాధ్యత వాహన యజమానిదేనని అధికారులు తెలిపారు.
డిజిటల్ చలాన్లకు చట్టబద్ధత
కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989లోని రూల్ 167 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌తో SMS, వాట్సాప్, ఈ-మెయిల్‌లను ట్రాఫిక్ చలాన్ల పంపిణీకి చెల్లుబాటు అయ్యే ఎలక్ట్రానిక్ మార్గాలుగా గుర్తించింది.
దీంతో అమలు సంస్థలు చాలా సందర్భాల్లో భౌతికంగా నోటీసులు అందించాల్సిన అవసరం లేకుండానే డిజిటల్ రూపంలో చలాన్లు జారీ చేయవచ్చు.
“మెసేజ్ చూడలేదు” అంటే సరిపోదు
నెల రోజుల గడువు పూర్తైన తర్వాత వాహన్ డేటాబేస్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌కు పంపిన ఏ చలాన్‌నైనా వాహన యజమానికి అందినట్టుగానే పరిగణిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
దీంతో చలాన్ సమాచారం తెలియలేదని లేదా మెసేజ్ అందలేదని చెబుతూ ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులను ప్రశ్నించే అవకాశం గణనీయంగా తగ్గనుంది.
ఈ నిర్ణయం ఎందుకు?
పాత మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్ వివరాలు కొనసాగడం వల్ల పెద్ద సంఖ్యలో చలాన్లు చెల్లించకుండా మిగిలిపోతున్నాయని అధికారులు తెలిపారు. నోటీసులు అందలేదన్న వివాదాలు కూడా ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు.
వాహన్ డేటాబేస్‌లో ఉన్న సంప్రదింపు వివరాలకు నేరుగా చలాన్లు పంపడం ద్వారా నిబంధనల అమలు మెరుగుపడటంతో పాటు బకాయిల వసూళ్లు వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చేసిన సవరణల తర్వాత రాష్ట్రాలకు ఎలక్ట్రానిక్ సమాచార మార్గాల ద్వారా చలాన్లు పంపే అవకాశం లభించింది.



