ఐదు నెలల్లోనే మరో ట్రిలియన్ డాలర్లు పెరిగిన అప్పు
అమెరికా జాతీయ అప్పు తొలిసారి 40 ట్రిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని దాటింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 3,320 లక్షల కోట్లు. గత ఐదు నెలల్లోనే అమెరికా అప్పు మరో ట్రిలియన్ డాలర్లు పెరిగింది.
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) నివేదిక ప్రకారం.. అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఆర్థిక పరిస్థితి అత్యంత బలహీనంగా ఉంది.
రక్షణ, సంక్షేమ పథకాల ఖర్చులతో పెరుగుతున్న భారం
అమెరికా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న అప్పుల భారం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. రక్షణ ఖర్చులు, Social Security, Medicareతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది.
మరోవైపు లోటు బడ్జెట్‌పై చెల్లించాల్సిన వడ్డీ కూడా పెరుగుతోంది. దీంతో అమెరికా అప్పుల భారం వేగంగా పెరుగుతోంది.
అప్పుల పెరుగుదల వేగం కూడా ఆందోళన కలిగిస్తోంది. 2026 మార్చిలో అమెరికా అప్పు 39 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా.. అంతకుముందు 2025 అక్టోబర్‌లో 38 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
అంటే ప్రతి ఐదు నెలలకు దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల చొప్పున అప్పు పెరుగుతోంది.
ట్రంప్ ప్రభుత్వం మరోవైపు రక్షణ వ్యయాన్ని పెంచుతోంది. ఇరాన్‌తో ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ ఖర్చులు మరింత పెరుగుతున్నాయి.
మరోవైపు గ్యాస్, నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
అనవసర ఖర్చులను తగ్గించి, ఆర్థిక వృద్ధి వేగం పెంచడం ద్వారా అప్పు-జీడీపీ నిష్పత్తి పరిధి దాటకుండా చూసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని White House ప్రతినిధి కుష్ దేశాయ్ అన్నారు.
అమెరికన్లపై ఇప్పటికే ప్రభావం
పెరుగుతున్న అప్పుల ప్రభావం అమెరికన్ల రోజువారీ జీవితాలపై కూడా పడుతోందని నిపుణులు చెబుతున్నారు.
గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు తగ్గడంతో జీతాలపై ప్రభావం పడుతోంది. వస్తు, సేవల ధరలు కూడా పెరుగుతున్నాయి.
“ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం నిలకడలేకుండా ఉంది.
ప్రపంచ యుద్ధం వంటి ఏదైనా ఊహించని ఘటన జరిగితే, ఈ సవాలు సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది” అని Bipartisan Policy Center అధ్యక్షురాలు మార్గరెట్ స్పెల్లింగ్స్ హెచ్చరించారు.
వడ్డీలకే ఏటా రూ. 83 లక్షల కోట్లు
Treasury Bonds ఆదాయాలు దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరడంతో అమెరికా చెల్లించాల్సిన వడ్డీ భారం భారీగా పెరుగుతోంది.
ఏటా రూ. 83 లక్షల కోట్లు వడ్డీల చెల్లింపులకే వెళ్తున్నాయి.
అయితే 40 ట్రిలియన్ డాలర్ల అప్పు వెంటనే సమస్యగా మారాల్సిన అవసరం లేదని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం ఒక కారణమని వారు చెబుతున్నారు.
అంతేకాకుండా ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ తన హోదాను కొనసాగిస్తుండటంతో అమెరికాకు మరింత అప్పు తీసుకునే సామర్థ్యం ఉందని వివరిస్తున్నారు.
2027 నాటికి రుణ పరిమితి చేరే అవకాశం
ప్రస్తుతం అమెరికా రుణ పరిమితి 41.1 ట్రిలియన్ డాలర్లు. 2027 నాటికి ఈ పరిమితిని చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పుడు అమెరికా కాంగ్రెస్ రుణ పరిమితిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
అమెరికా ప్రత్యర్థి చైనాకు రూ. 690.47 లక్షల కోట్లు, భారత్‌కు రూ. 200.53 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు అంచనా వేశారు.



