రాజమండ్రి ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలకు అనుమతులు ఇచ్చినట్లు ఆధారాలు సమర్పిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. నన్నయ వర్సిటీ అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. మౌలిక సదుపాయాలు లేని కాలేజీలకు ముడుపులు తీసుకుని అనుమతులు ఇచ్చారని, ఒకే అధ్యాపకుడు ఐదారు కాలేజీల్లో పనిచేస్తున్నట్లు చూపి దోపిడీకి పాల్పడుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. డీడీల (DD) క్లోనింగ్ చేసి పరీక్షల ఫీజుల్లోనూ భారీ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు.

విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం కూటమి ప్రభుత్వం ‘యూనిఫైడ్ యాక్ట్’ తీసుకురావడానికి కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. దీనివల్ల అన్ని యూనివర్సిటీల అఫ్లియేషన్ ప్రక్రియలో ఒకే విధానం అమలవుతుందని చెప్పారు. అఫ్లియేషన్ ప్రక్రియను స్ట్రీమ్‌లైన్ చేయడానికి జియో ట్యాగింగ్, డిజిటలైజేషన్, ఫోటోలు మరియు వీడియోలతో కూడిన ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పకడ్బందీ నిబంధనలతో వర్సిటీకి కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (EC) నియామక ప్రక్రియ చేపడతామని లోకేష్ స్పష్టం చేశారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాల్లో నిధుల దుర్వినియోగంపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
