నిర్వహణ లోపాలు, సాంకేతిక సమస్యలపై మధ్యంతర నివేదిక
బయలుదేరే సమయానికే సముద్ర ప్రయాణానికి అనర్హమన్న దర్యాప్తు బృందం
కొచ్చి: కేరళ తీరంలో గత ఏడాది మునిగిపోయిన కంటైనర్ నౌక ఎంఎస్సీ ఎల్సా-3 ప్రమాదానికి నౌక నిర్వహణలో నిర్లక్ష్యం, పరికరాల లోపాలు, సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడం.
భద్రతా పర్యవేక్షణ బలహీనంగా ఉండటం వంటి కారణాలు దారితీశాయని ప్రాథమిక దర్యాప్తు తేల్చింది.
సిబ్బంది తమ స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ కేరళ హైకోర్టుకు సమర్పించిన మధ్యంతర నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
అయితే మంగళవారం హైకోర్టు నౌకలో పనిచేసిన ముగ్గురు సిబ్బందికి — ఎలక్ట్రో టెక్నికల్ ఇంజినీర్, ఓ నావికుడు, మోటార్మ్యాన్కు — స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
లైబీరియా జెండాతో నడిచే ఎంఎస్సీ ఎల్సా-3 నౌకను 1997లో నిర్మించారు. 2025 మే 25న విజింజం, కొచ్చి మధ్య కేరళ తీరానికి సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ఇది మునిగిపోయింది.
నౌకలో 643 కంటైనర్లు ఉండగా, వాటిలో 13 ప్రమాదకర రసాయనాలు కలిగినవి. దీంతో కేరళ, తమిళనాడు తీర ప్రాంతాల్లో పర్యావరణ ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
బ్యాలస్ట్ వ్యవస్థ వైఫల్యంతో మొదలైన సమస్య
నివేదిక ప్రకారం 2025 మే 24న బ్యాలస్ట్ వ్యవస్థలో లోపం తలెత్తడంతో నౌక ఒకవైపుకు వంగడం ప్రారంభమైంది. 12 గంటల్లో వంగిన కోణం 27 డిగ్రీలకు చేరింది. దీంతో డెక్‌పై ఉన్న కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి.
తర్వాత నౌక కుడివైపు వంగిన కోణాన్ని 22 డిగ్రీలకు తగ్గించగలిగారు. కొన్ని గంటలు పరిస్థితి స్థిరంగా కనిపించినా, అనంతరం మళ్లీ వంగడం పెరిగింది.
ఈ లోపం చివరకు విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను దెబ్బతీసి పూర్తిస్థాయి విద్యుత్ అంతరాయానికి దారితీసింది. దీంతో నౌకను నియంత్రించే సామర్థ్యం పూర్తిగా కోల్పోయింది.
వంగిన స్థితిని సరిచేసే అవకాశం లేకపోవడంతో సుమారు 24 గంటల్లో పరిస్థితి మరింత దిగజారి నౌక మునిగిపోయిందని నివేదిక పేర్కొంది.
కీలక వ్యవస్థలు పనిచేయలేదు
బ్యాలస్ట్ వాటర్ వ్యవస్థ, నౌక సమతుల్యతను నియంత్రించే హీలింగ్ కరెక్షన్ వ్యవస్థ రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయని దర్యాప్తులో తేలింది. దీనివల్ల నౌక కుడివైపు 26 డిగ్రీల మేర అదుపు తప్పి వంగిపోయింది.
హీలింగ్ ట్యాంక్ వ్యవస్థ పనిచేయకపోవడమే కాకుండా ఆటోమేటిక్ మోడ్‌లో కూడా లేదని నివేదిక పేర్కొంది. సరుకు లోడ్, అన్లోడ్ చేసిన తర్వాత నౌకను తరచూ మాన్యువల్‌గా సమతుల్యం చేసేవారని, దీనివల్ల విజింజం సహా పలు టెర్మినళ్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించింది.
నెలల తరబడి అలాగే ఉన్న లోపాలు
పాత నౌక కావడంతో ఆధునిక నౌకల్లో ఉండే అదనపు భద్రతా వ్యవస్థలు, పర్యవేక్షణ సదుపాయాలు ఇందులో లేవని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
బ్యాలస్ట్ పరికరాల నిర్వహణ సరైన స్థాయిలో జరగలేదని, పలు సాంకేతిక లోపాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది.
కార్గో హోల్డ్ బిల్జ్ పంపింగ్ వ్యవస్థ, బిల్జ్ సెన్సర్లలో లోపాలపై వర్గీకరణ సంస్థ బ్యూరో వెరిటాస్ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ పలు కీలక లోపాలు నెలల తరబడి అలాగే కొనసాగాయి.
అత్యవసర విడిభాగాల కోసం చేసిన అభ్యర్థనలకు ఎనిమిది నెలలు గడిచినా సరఫరా జరగలేదని వెల్లడించింది. “కీలకమైనవి”గా గుర్తించిన విడిభాగాలు కూడా ప్రమాదం జరిగే సమయానికి అందలేదని నివేదిక పేర్కొంది.
లోపభూయిష్టంగా గుర్తించిన బ్యాలస్ట్ వ్యవస్థ భాగాలను మార్చకుండా తాత్కాలిక మరమ్మతులతోనే కొనసాగించారని తెలిపింది.
శిక్షణలోనూ లోటుపాట్లు
నౌక భద్రతా నిర్వహణ వ్యవస్థలో అనేక వైఫల్యాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిర్వహణ ప్రమాణాలు బలహీనంగా ఉండటం, విడిభాగాల సరఫరాలో జాప్యం, యంత్రాల లోపాలు, సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడం ప్రధాన సమస్యలుగా పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో బ్యాలస్ట్ వ్యవస్థ నిర్వహణ, విద్యుత్ అంతరాయం సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి ప్రాయోగిక శిక్షణ లేదని తేలింది. సిద్ధాంతపరమైన అవగాహన ఉన్నప్పటికీ, మాన్యువల్ నియంత్రణ విధానాలపై చాలామందికి పూర్తి పరిజ్ఞానం లేదని పేర్కొంది.
నౌకలోకి చేరిన నీరు
డబుల్ బాటమ్ ట్యాంక్ నంబర్-5 మ్యాన్‌హోల్ కవర్ నుంచి నీరు లీక్ కావడం, మరో బ్యాలస్ట్ ట్యాంక్‌లో వెల్డింగ్ భాగంలో పగులు ఏర్పడటం వల్ల కార్గో హోల్డ్‌లోకి నీరు చేరినట్లు దర్యాప్తు గుర్తించింది.
ఈ లోపాల గురించి నౌకలో ఎలాంటి రికార్డులు లేకపోవడం ఆందోళనకరమని నివేదిక పేర్కొంది. దీనివల్ల లోపాల నివేదికల వ్యవస్థ సరిగా పనిచేయలేదని తేల్చింది.
క్రమంగా పెరిగిన నీటి ప్రవాహం, నిర్మాణ బలహీనతలు కలిసి చివరకు నౌక నిర్మాణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని తెలిపింది.
“విజింజం పోర్టు నుంచి బయలుదేరే సమయానికే ఈ నౌక సముద్ర ప్రయాణానికి తగిన స్థితిలో లేదు” అని నివేదిక స్పష్టం చేసింది.
తీర ప్రాంత సాంకేతిక బృందంపైనా విమర్శలు
సైప్రస్‌లోని లిమాసోల్ నుంచి పనిచేసే ఎంఎస్సీ సాంకేతిక నిర్వహణ వ్యవస్థపైనా దర్యాప్తు అధికారులు ప్రశ్నలు లేవనెత్తారు.
నౌక తీవ్రంగా వంగే పరిస్థితి ఏర్పడే 36 గంటల ముందే బ్యాలస్ట్ వ్యవస్థలో అసాధారణ ఒత్తిడి సంకేతాలు కనిపించాయని గుర్తించారు. అయినప్పటికీ ఆటోమేటెడ్ పర్యవేక్షణ వ్యవస్థలు గానీ, తీర ప్రాంత సిబ్బంది గానీ వాటిని గుర్తించలేదని తెలిపారు.
నౌక స్థిరత్వ సమస్యలను మొదటిసారి తెలియజేసిన తర్వాత నిపుణుల బృందాన్ని సమీకరించి సమర్థవంతమైన సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయడానికి మూడు గంటలకుపైగా సమయం పట్టిందని నివేదిక వెల్లడించింది.
ఆ సమయంలో తక్షణ చర్యలు తీసుకుని ఉంటే ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉండేదని పేర్కొంది.
మునిగే ముందు చివరి 12 గంటల్లో నౌక, తీర ప్రాంత సాంకేతిక బృందం మధ్య సమాచార మార్పిడి అంతరాయంగా సాగిందని తెలిపింది.
హీలింగ్ వ్యవస్థ, యంత్రాల నియంత్రణ వ్యవస్థ, కార్గో హోల్డ్ బిల్జ్ వ్యవస్థ, సహాయక ఇంజిన్ అలారం వ్యవస్థల్లో చాలాకాలంగా ఉన్న లోపాలను సరిచేయడంలో కంపెనీ విఫలమైందని నివేదిక విమర్శించింది.
ALSO READ

