నటి సుకన్య దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌తో చేసిన ఇంటర్వ్యూను ప్రసారం చేసిందన్న కేసులో సన్ టీవీ నెట్‌వర్క్‌కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 1996 ఏప్రిల్ 17న సన్ టీవీలో ప్రసారమైన ‘నేరుక్కు నేర్’ అనే కార్యక్రమం కారణంగా వివాదం మొదలైంది. తమిళ పత్రిక ‘నక్కీరన్’ ఎడిటర్ ఆర్.ఆర్. గోపాల్ వీరప్పన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వీరప్పన్ నటి సుకన్యకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడితో అక్రమ సంబంధం ఉందని నిరాధార ఆరోపణలు చేశారు. వీరప్పన్ చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, ఇవి సమాజంలో తన గౌరవానికి, కీర్తి ప్రతిష్ఠలకు తీవ్ర నష్టం కలిగించాయని సుకన్య కోర్టును ఆశ్రయించారు.
సుదీర్ఘ విచారణ అనంతరం 2015లో ట్రయల్ కోర్టు సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, రూ.10,00,500 నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీని ఆదేశించింది. దీనిపై సన్ టీవీ నెట్వర్క్ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ను విచారించిన జస్టిస్ కె. కుమరేశ్ బాబు నేతృత్వంలోని ధర్మాసనం, సన్ టీవీ వాదనలను తోసిపుచ్చింది. ఇంటర్వ్యూను ప్రసారం చేసే ముందు దానిలోని అభ్యంతరకర, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను ధ్రువీకరించుకోవడంలో, వాటిని తొలగించడంలో బ్రాడ్‌కాస్టర్ విఫలమైందని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ, సుకన్యకు నష్టపరిహారం చెల్లించాలని తుది తీర్పు వెలువరించింది.

