అవనిగడ్డలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా కొనసాగుతోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ హైస్కూలును సందర్శించిన ఆయన, అక్కడ పథకం అమలు తీరును పరిశీలించారు.
విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధం చేసిన పులిహోర, చెట్నీ, ఉడికించిన కోడిగుడ్డు వంటి ఆహార పదార్థాల నాణ్యతను ఎమ్మెల్యే స్వయంగా తనిఖీ చేశారు. మెనూ అమలు విధానంపై కూడా ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే, ఆహారం నాణ్యతపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులు భోజనం బాగుందని తెలిపినట్లు సమాచారం. అనంతరం ఆయన స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరతాన్నధాత్రిగా పేరుపొందిన డొక్కా సీతమ్మ పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందుతున్నట్లు తెలిపారు. మెనూను ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నామని అన్నారు.
