2026లో EV రిజిస్ట్రేషన్లు 25 లక్షలు దాటే అవకాశం
2030 నాటికి 20% EV వినియోగంతో రూ.1 లక్ష కోట్ల దిగుమతి భారం తగ్గే అవకాశం
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత వేగవంతం చేస్తోందని SBI రీసెర్చ్ గురువారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం ఉన్న 10 శాతం స్థాయి నుంచి 2030 నాటికి EVల వినియోగం 20 శాతానికి చేరితే, దేశానికి ఏటా సుమారు రూ.1 లక్ష కోట్ల ఇంధన దిగుమతి వ్యయం ఆదా కావచ్చని నివేదిక పేర్కొంది.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇరాన్ యుద్ధం తర్వాత భారత్‌లో EV రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. 2025లో నెలకు సగటున 1.3 లక్షల EVలు నమోదు కాగా, మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో ఆ సంఖ్య సగటున 2.3 లక్షలకు చేరింది.
ప్రస్తుత వృద్ధి కొనసాగితే 2026లో మొత్తం EV రిజిస్ట్రేషన్లు 25 లక్షలను దాటే అవకాశముందని SBI రీసెర్చ్ అంచనా వేసింది.
దేశంలో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాల వాటా కూడా వేగంగా పెరుగుతోంది. 2024లో ఇది 2 శాతం కంటే తక్కువగా ఉండగా, 2026లో ఇప్పటివరకు 8 శాతానికి పైగా చేరింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ వాటా ఇప్పటికే 10 శాతాన్ని దాటినట్లు నివేదిక తెలిపింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29,151 Electric vehicle ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే మొత్తం ఛార్జింగ్ స్టేషన్లలో 35 శాతం ఉన్నాయి.
కొత్త EV విధానంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో 32,000 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. EVల విజయానికి విస్తృతంగా ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండటం కీలకమని SBI రీసెర్చ్ అభిప్రాయపడింది.
2025లో దేశంలో మొత్తం 2.86 కోట్ల వాహనాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2030 నాటికి 4 కోట్లకు చేరే అవకాశముందని నివేదిక అంచనా వేసింది. వీటిలో 20 శాతం అంటే సుమారు 80 లక్షల వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండొచ్చని పేర్కొంది.
2027 నుంచి 2030 మధ్యకాలంలో ప్రస్తుత పరిస్థితితో పోలిస్తే అదనంగా 35 లక్షల EVలు పెట్రోల్ వాహనాల స్థానాన్ని భర్తీ చేసే అవకాశముందని SBI రీసెర్చ్ తెలిపింది.
ఈ దిశగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త EV విధానం ప్రశంసనీయమని నివేదిక పేర్కొంది.



