వాషింగ్టన్/తెహ్రాన్: US Iran conflict మధ్యప్రాచ్యంలో ఇరాన్ చేపట్టిన దాడి ప్రయత్నాలకు ప్రతిస్పందనగా తాము రాత్రికి రాత్రే “ఆత్మరక్షణ దాడులు” నిర్వహించామని అమెరికా సైన్యం ప్రకటించింది.
హోర్ముజ్ జలసంధిలోని ఖెష్మ్ ద్వీపంపై దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) వెల్లడించింది.
అదే సమయంలో నౌకలు, గల్ఫ్ దేశాల వైపు ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది.
కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి
కువైట్ సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరాన్‌కు చెందిన డ్రోన్లు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకాయి. దీంతో భవనాలకు గణనీయమైన నష్టం వాటిల్లింది. పలువురు గాయపడ్డారు. బుధవారం ఉదయం విమాన రాకపోకలను నిలిపివేశారు.
ఇది “ఇరాన్ చేసిన నేరపూరిత దాడి” అని కువైట్ రక్షణశాఖ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-ఒతైబి అన్నారు. గాయపడిన వారికి వైద్య చికిత్స అందించామని చెప్పారు.
ఖెష్మ్ ద్వీపంలోని సైనిక కేంద్రంపై దాడి
ఖెష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక భూగత నియంత్రణ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు సెంట్‌కామ్ పేర్కొంది. ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తున్న పౌర నౌకల వైపు ఇరాన్ పంపిన మూడు దాడి డ్రోన్లను కూడా కూల్చివేసినట్లు వెల్లడించింది.
హోర్ముజ్ జలసంధి భద్రతకు భంగం కలిగిస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించింది.
US Iran conflict ఇరాన్ పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రాంతంలోని దేశాలపై ప్రయోగించిందని సెంట్‌కామ్ తెలిపింది. కువైట్ వైపు వచ్చిన రెండు క్షిపణులు లక్ష్యాన్ని చేరకముందే విచ్ఛిన్నమయ్యాయని, బహ్రెయిన్‌పై ప్రయోగించిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ గగనతల రక్షణ దళాలు అడ్డుకున్నాయని పేర్కొంది.
అమెరికా సైనిక స్థావరాలు ఉన్న బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ గతంలో కూడా దాడులు చేసింది.
చమురు ట్యాంకర్‌ను నిలిపివేసిన అమెరికా
హోర్ముజ్ జలసంధిపై అమెరికా అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధం నేపథ్యంలో ఇరాన్ వైపు ప్రయాణిస్తున్న ఖాళీ చమురు ట్యాంకర్‌ను నిర్వీర్యం చేసినట్లు సెంట్‌కామ్ తెలిపింది.
బోట్స్వానా జెండాతో ప్రయాణిస్తున్న ఎం/టీ లెక్సీ నౌక సిబ్బంది పలుమార్లు హెచ్చరించినా స్పందించలేదని పేర్కొంది. దీంతో అమెరికా యుద్ధవిమానం హెల్‌ఫైర్ క్షిపణిని నౌక ఇంజిన్ విభాగంపై ప్రయోగించిందని వివరించింది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.
ఏప్రిల్ 13 నుంచి అమల్లోకి వచ్చిన దిగ్బంధం తర్వాత ఆరు వాణిజ్య నౌకలను నిర్వీర్యం చేశామని, మరో 122 నౌకలను దారి మళ్లించామని సెంట్‌కామ్ వెల్లడించింది.
“యుద్ధం ముగిసింది”
అమెరికా విదేశాంగ మంత్రి Marco Rubio కాంగ్రెస్ ముందు హాజరై మాట్లాడారు. జలసంధిని తిరిగి తెరవాలనే ప్రతిపాదనకు బదులుగా ఇరాన్‌కు ఆంక్షల సడలింపు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
“ఆంక్షల సడలింపు ఉంటే అది షరతులతోనే ఉంటుంది. ఆంక్షలు విధించడానికి కారణమైన అణు కార్యక్రమానికి సంబంధించిన చర్యలు ఇరాన్ తీసుకోవాలి” అని చెప్పారు.
ALSO READ

