ఐదుగురు అరెస్ట్
డ్రోన్లు, స్నైపర్ దాడులతో కలకలం సృష్టించాలన్న యత్నం
వాషింగ్టన్:
వైట్‌హౌస్‌లో ఆదివారం జరిగిన యూఎఫ్‌సీ (UFC) ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకుని పన్నిన భారీ దాడి కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు అమెరికా న్యాయ శాఖ మంగళవారం వెల్లడించింది.
కుట్రలో భాగంగా పేలుడు పదార్థాలు అమర్చిన డ్రోన్లతో సమీప భవనాలపై దాడి చేయడం, ఆ తర్వాత కీలక వ్యక్తులపై కాల్పులు జరపడం ప్రణాళికలో ఉన్నట్లు అభియోగ పత్రాల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రధాన అనుమానితుడు 19 ఏళ్ల టైసెన్ సి. ప్రాపర్‌ను గత వారం ఓహియోలో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద లభించిన గుప్త సందేశాల ఆధారంగా మిగిలిన నిందితుల పాత్ర బయటపడినట్లు అధికారులు తెలిపారు.
నిందితులు అతివాద మతపరమైన భావజాలం, ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు.
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, “అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన ఆపరేషన్‌తో ప్రణాళికాబద్ధ దాడులను పూర్తిగా అడ్డుకున్నాం” అని పేర్కొన్నారు.
అరెస్టయిన వారిలో కాలిఫోర్నియాకు చెందిన 24 ఏళ్ల బ్రయాన్ ఒమర్ రోవా, 32 ఏళ్ల మైకేల్ అలన్ థామస్, మిస్సోరీకి చెందిన 32 ఏళ్ల డేనియల్ కె. ఎస్క్రిడ్జ్, నెబ్రాస్కాకు చెందిన 31 ఏళ్ల అబ్రహాం హెర్మొసిల్లో అల్వారెజ్ ఉన్నారు. వీరందరిపై హత్యకు కుట్ర పన్నిన అభియోగాలు నమోదు చేశారు.
జనాన్ని స్నైపర్ల వైపు మళ్లించే పథకం
కోర్టు పత్రాల ప్రకారం డ్రోన్ దాడులతో భయాందోళనలు సృష్టించి, అక్కడి నుంచి పారిపోయే జనాన్ని ముందుగా సిద్ధంగా ఉన్న స్నైపర్ బృందం వైపు మళ్లించాలని కుట్రదారులు భావించారు.
ఆ తర్వాత రెండో దశలో మరికొందరు వైట్‌హౌస్ గేట్లపై దాడి చేయాలన్న ప్రణాళిక రూపొందించినట్లు ఆరోపించారు.
వైట్‌హౌస్ దక్షిణ ప్రాంగణంలో జరిగిన ఆహ్వానితుల ప్రత్యేక కార్యక్రమానికి సుమారు 4,300 మంది హాజరయ్యారు. సమీప ప్రాంతాల్లో మరో 85 వేల మంది వరకు పోరాటాలను వీక్షించే అవకాశం కల్పించారు.
కోర్టు దాఖలాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు
వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా లక్ష్యాల జాబితాలో ఉన్నారు. అయితే వారందరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
తల్లి ఫిర్యాదుతో బయటపడిన కుట్ర
జూన్ 10న ప్రాపర్ తల్లి స్థానిక అధికారులను సంప్రదించింది. అతడు పెద్ద మొత్తంలో తుపాకులు కొనుగోలు చేయడం, మాజీ సైనికులు, క్రైస్తవ మత భావజాలం కలిగినవారితో ఉన్న ఆన్‌లైన్ సంబంధాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.
దీంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రభుత్వ అవినీతి, ఎప్స్టీన్ ఫైళ్ల వ్యవహారం, డేటా సెంటర్ల వల్ల స్థానిక వనరులపై పడుతున్న ఒత్తిడి వంటి అంశాలపై అసంతృప్తితో ఈ బృందం “విప్లవానికి శ్రీకారం చుట్టాలని” భావించినట్లు అభియోగ పత్రాల్లో వెల్లడించారు.
అమెరికా తప్పుదోవ పట్టుతోందని, దాన్ని పూర్తిగా కూల్చి మళ్లీ నిర్మించాల్సిన అవసరం ఉందని సభ్యులు నమ్మినట్లు ఎఫ్‌బీఐ పత్రాలు చెబుతున్నాయి.
మార్చి నెలలో “వాంగార్డ్ ఆఫ్ ది ఓల్డ్” లేదా “వాంగార్డ్ ఆఫ్ ది ఓల్డ్ రిపబ్లిక్” పేరుతో ఉన్న టిక్‌టాక్ గ్రూప్ ద్వారా సభ్యులు పరస్పరం సంప్రదింపులు ప్రారంభించినట్లు ప్రాపర్ ఎఫ్‌బీఐ విచారణలో అంగీకరించాడు.
సభ్యుల పరిశీలన పూర్తైన తర్వాత వారిని సిగ్నల్ యాప్‌లోని గుప్త చర్చా వేదికలకు చేర్చినట్లు అభియోగాలు చెబుతున్నాయి.
ప్రధాన గ్రూప్‌లో దాదాపు 19 మంది ఉండగా, బాధ్యతలు, ప్రాంతాల ఆధారంగా చిన్న గ్రూపులు కూడా నిర్వహించినట్లు వెల్లడైంది.
వైట్‌హౌస్‌పై దాడికి అల్వారెజ్ నాయకత్వం
అల్వారెజ్ ఈ దాడి ప్రణాళిక రూపకల్పన, నిర్వహణ, సమన్వయం బాధ్యతలు చూసినట్లు న్యాయ శాఖ తెలిపింది. డ్రోన్ల ఏర్పాట్లలో కూడా అతడి పాత్ర ఉందని పేర్కొంది.
నిందితులు వాషింగ్టన్ నగర పటాలను పంచుకుని, స్నైపర్ స్థానాలు, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, విద్యుత్ వ్యవస్థలను లక్ష్యాలుగా గుర్తించినట్లు కోర్టు పత్రాల్లో ఉంది.
ఆయుధాలు, వ్యూహాత్మక సామగ్రి, మ్యాప్‌లతో కూడిన సామాజిక మాధ్యమాల పోస్టులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాను వ్యక్తిగతంగా కాల్పులు జరపడానికి వెళ్లడం లేదని ప్రాపర్ చెప్పినప్పటికీ, ఇతర సభ్యులు హింసకు సిద్ధంగా ఉన్నారని అతడే అంగీకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసుపై స్పందించిన సీక్రెట్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ మ్యాట్ క్విన్, దీనిని “తీవ్రమైన ముప్పు”గా అభివర్ణించారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేదు.
జీ7 సదస్సు సందర్భంగా ఈ కుట్రపై ప్రశ్నించగా అధ్యక్షుడు ట్రంప్, “దాని గురించి నాకు సమాచారం లేదు” అని చెప్పారు.
నిందితులపై అభియోగాలు రుజువైతే జీవిత ఖైదుతో పాటు 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ శాఖ తెలిపింది. ప్రాపర్‌పై అదనంగా మూడు అభియోగాలు నమోదు చేశారు.
వాటిలో వైట్‌హౌస్ ప్రాంగణంలో హింసకు కుట్ర పన్నిన కేసు కూడా ఉంది. దీనికి గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష పడవచ్చు.
ఈ కేసులో ప్రాథమిక విచారణ జూన్ 29న జరగనుంది.
ALSO READ



