BRS అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్ పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆమె ఆరోపించారు.
సీతక్క తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ రిజిస్టర్ పోస్టు ద్వారా ఈ నోటీసును పంపారు. అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని, టెండర్ కమిటీ నిర్ణయాల మేరకే కాంట్రాక్ట్ కేటాయించబడిందని నోటీసులో స్పష్టం చేశారు.

మొత్తం టెండర్ విలువ రూ.44 కోట్లు మాత్రమే ఉండగా, రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం అసత్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికలపై జరుగుతున్న ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.48 గంటల్లో తప్పుడు పోస్టులు తొలగించి క్షమాపణ చెప్పాలని, లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించారు.
