ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాబోయే ఐదేళ్లలో (2030-31 నాటికి) 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం 20 లక్షల ఎకరాల్లో ఉన్న ప్రకృతి సాగును 50 లక్షల ఎకరాలకు విస్తరించాలని, దీనివల్ల రైతులకు పెట్టుబడి తగ్గి లాభాలు పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. సుభాష్ పాలేకర్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ‘కోకో సిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాగు నుంచి మార్కెటింగ్ వరకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలో పీపీపీ విధానంలో గిరిజనుల భాగస్వామ్యంతో పెద్దఎత్తున కుంకుమ పువ్వు సాగుకు శ్రీకారం చుట్టనున్నారు. అరటి, రొయ్యలు, ఎండుమిర్చి ఎగుమతులను పెంచేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్‌లతో ఒప్పందాలు చేసుకోవాలని, నాణ్యతా ప్రమాణాల కోసం ఏప్రిల్ కల్లా ‘ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్’ వ్యవస్థను తీసుకురావాలని ఆదేశించారు.ఇకపై రాష్ట్రంలో ఆక్వా సాగు నమోదును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అలాగే అంగన్‌వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టులను నేరుగా రైతులకే ఇవ్వాలని నిర్ణయించారు.”కుప్పం ఫ్లవర్ ఫెస్టివల్ తరహాలో ప్రతి జిల్లాలో స్థానిక పంటలపై ఫెస్టివల్స్ నిర్వహించి పర్యాటకాన్ని, మార్కెటింగ్‌ను ప్రోత్సహించాలి” అని సీఎం సూచించారు.
